Sunday, December 9, 2012

ప్రపంచ తెలుగు మహా సభలు-శుభవార్త



శుభవార్త.కొండలరావు గారి తెలుగు-ఉర్దూ నిఘంటువు పునర్ముద్రణకు మండలి బుద్ధప్రసాద్ గారు అంగీకరించారు.
ఐ.కొండలరావు గారి 1300 పేజీల తెలుగు-ఉర్దూ నిఘంటువు (1938) ను గీటురాయి ఎడిటర్ ఎస్.ఎం.మలిక్ గారు (9848229218) తన లైబ్రరీలోనుండి తీసి పునర్ముద్రణకోసం ఇచ్చారు.హుసేన్(9985394757) రసూల్ (9059956811) బృందం డీటీపీ పని మొదలుబెట్టింది.ఈ మధ్య ప్రభుత్వం విడుదలచేసిన 18 రకాల తెలుగు యూనీకోడు ఫాంట్లలోనే ఈ నిఘంటువు తయారౌతుంది.

నూర్ బాషా రహంతుల్లా
డిప్యూటీ కలక్టర్ విజయవాడ
9948878833



అధికార భాషా సంఘం అధ్యక్షులు గౌరవనీయులు
శ్రీ
మండలి బుద్ధ ప్రసాద్  గారికి నమస్కారం
తెలుగు భాష అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే నాయకునిగా తమరికున్న పేరు అందరికీ తెలిసిందే గనుక భాషాభివృద్ధి కోసం ఏం చెయ్యాలో మరొకరు మీకు చెప్పవలసిన పనిలేదు.అయినా ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా నామదిలో మెదిలిన కోరికలను  పరిశీలనార్ధమై తమ దృష్టికి తీసుకు వస్తున్నాను.
1. మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి.ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడం లేదు.ముద్రించాల్సిన అవసరం ఉంది.1938-మొదటి ఉర్దూ - తెలుగు నిఘంటువు 1938లో వరంగల్ ఉస్మానియా కాలేజిలో అరబిక్ మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.మొత్తం 857 పేజీల పుస్తకం.పునర్ముద్రణ చేయాటానికి అంగీకరించిన తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గారికి దీనిని 6.10.2008 న అందజేశాను.2009 ఏప్రిల్ 25 తేదీన ఉర్దూ తెలుగు నిఘంటువు పునర్ముద్రించి అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబికెప్రసాద్ గారు విడుదల చేశారు.ఇప్పుడు ముషాయిరాల కంటే ముఖ్యమైన తెలుగు-ఉర్దూ నిఘంటువు కావాలి. కొండలరావు గారిదే తెలుగు-ఉర్దూ నిఘంటువు ఉందని సామల సదాశివ గారు నాతో చెప్పారు.1300 పేజీల ఈ నిఘంటువు తన దగ్గర కూడా ఉందనీ,పునర్ముద్రణకోసం ఇస్తానని ఖుతుబుద్దీన్ (ఫోన్.9703771012) గారు చెప్పారు. 1906 లో తిమ్మారెడ్డి గారు రాసిన  తెలుగు-తెలుగు-ఉర్దూ శబ్దార్ధచింతామణి 213 పేజీలుంది.మొత్తం తెలుగు లిపిలోనే ఉంది. http://archive.org/details/sabdarthacintama00unknsher.ఏదో ఒక సంస్థ ద్వారా  చిన్ని పుస్తకాన్ని ముద్రింపజేస్తే బాగుంటుంది.
2. నాగార్జున వెన్న , కొలిచాల సురేశ్ లాంటివారు  http://eemaata.com/font2unicode/index.php5 లతో తెలుగుకు అద్భుతమైన సేవ చేశారు.వెన్న నాగార్జున గారు (vnagarjuna@gmail.com) యూనికోడేతర ఫాంట్లన్నిటినీ యూనీకోడ్‌కి మార్చేలాగా పద్మ ఫాంటు మారక ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్‌కి మార్చగల సామర్ధ్యానికి ఎదిగింది.http://padma.mozdev.org/. కొన్ని అను ఫాంట్ల సమస్య కొలిచాల సురేశ్‌ (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది. 2009లో అను నుండి యూనికోడ్‌ లోకి మార్చే ఒక మారకానికి anurahamthulla version అని నా పేరు కూడా పెట్టారు. శ్రీకృష్ణదేవరాయ,పెద్దన,తిమ్మన,తెనాలిరామకృష్ణ,సూరన్న,రామరాజ,మల్లన్న,ధూర్జటి,రామభద్ర,గిడుగు,గురజాడ,సురవరం, యన్.టి.ఆర్.,మండలి,నాట్స్, పొన్నాల,రవిప్రకాష్,లక్కిరెడ్డి అనే 18 అక్షరరూపాలను విడుదల చేశారు.సంతోషం . కానీ ఇప్పటికే అనూ ,సూరి,లాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కావాలి. తర్జుమా పరికరాల తయారీ ప్రారంభదశలో ఉంది గనుక కొన్ని తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి. వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ఇవ్వాలి , ప్రతి యేటా తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.
3. తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి.
4 . సజీవ వాహిని నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్‌సైట్‌ రూపొందించారు.తెలుగు భగవద్గీతకు గానీ, తెలుగు కేతలిక్‌ బైబిల్‌కు గానీ, తెలుగు ఖురాన్‌కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.http://sajeevavahini.com/telugubible అందరూ చూడదగినది. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ మిగతా తెలుగు పుస్తకాలకు కూడా లభించేలా కృషి చేస్తే విషయాల పరిశీలన సులభం అవుతుంది. తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంథాలకు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎంతో అవసరం. కాలంతో పాటు మనం కూడా మారాలి. తెలుగులో తయారైన పి.డి.యఫ్‌. ఫైలును కూడా నేరుగా యూనీకోడ్‌ లోకి మార్చగలిగే స్థాయి రావాలి.
5 . రాష్ట్ర అధికార బాషా సంఘం మాజీ  అధ్యక్షుడు ఏబికె ప్రసాద్‌గారు ప్రభుత్వానికి కొన్ని మంచి సిఫారుసులు చేసారు. (ఈనాడు: 19-5-2005).అందులో ఈనాటికీ అమలు కానివి: 1) తెలుగు మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 2) ప్రైవేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి. 3) వ్యాపార సంస్థలు, దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి.4 ) తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు రెండవ స్థానంలో ఉన్నందున ఆ రాష్ట్రంలో తెలుగును రెండవ అధికార భాషగా ప్రకటించాలి. 5 ) రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక బాషలోకి తేవాలి. 6 ) ఎనిమిదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న బాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి.  7 ) స్థానిక న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.  8 ) మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి.ప్రపంచ తెలుగు మహా సభలలో ఈ డిమాండ్లను పునరుద్ఘాటించాలి.
 
6. తెలుగు భాషా రక్షణ అభివృద్ధికై మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్‌. ఐ.పి.యస్‌ అధికారుల్ని, గవర్నర్లును మాత్రమే మన రాష్ట్రంలో నియమించేలా కేంద్రాన్ని కోరాలి.తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడవిూ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి. .కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే వాతావరణం కల్పించాలి. అంటే ఇంగ్లీషు రాకపోయినా కలెక్టరు , డాక్టరు , ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు.
 
7 . తెలుగు జాతికి గుర్తింపు, మనలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి. అవి మనల్ని విడదీస్తున్నాయి. ఈ భాష మనల్ని కలుపుతుంది. ఈ భాష మాట్టాడేవాళ్ళ సంఖ్యనుబట్టి, జనబలాన్ని బట్టి పార్లమెంటులో మన గౌరవం మనకు దక్కుతుంది. హిందీతో పాటు తెలుగును కూడా ఇతర భాషలవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది.పార్లమెంటులో హిందీ వాళ్ళలాగా మనం కూడా తెలుగులో మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులన్నీ తెలుగులో పొందవచ్చు. కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ తెలుగులో నడుపవచ్చు. చట్టాలన్నీ తెలుగులోకి మార్చబడతాయి. తెలుగులో తీర్పులొస్తాయి. తెలుగులో ఇచ్చే అర్జీలు ఢిల్లీలో కూడా చెల్లుతాయి. ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి కొండంత అండ, గౌరవం హిందీ వాళ్ళతో  పాటు సమానంగా లభిస్తాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో బోర్డుల విూద తెలుగులో కూడా పేర్లు రాస్తారు. ఈ రోజున హిందీ భాష వల్ల హిందీ వాళ్ళకు ఏయే ప్రయోజనాలు ఒనగూడాయో అవన్నీ తెలుగు వాళ్ళు పొందవచ్చు.ప్రపంచ తెలుగు మహా సభల్లో తెలుగును జాతీయ భాషగా ప్రకటించాలని తీర్మానం చెయ్యాలి.  
8 . ఏ జాతి సమస్త వ్యవహారాలు ఆ జాతి మాతృ భాషలోనే జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.  అది ఎప్పటికీ విజేతగానే ఉంటుంది. మన రాష్ట్రంలో తెలుగు మాతృభాషగల 'తెలుగు ముస్లిములు' లక్షలలో వున్నారు. నిత్యం ఉర్దూ మాట్లాడే ముస్లింలలో కూడా పలువురికి ఉర్దూ చదవడం, రాయడం రాదు. వీరంతా తెలుగులోనే రాతకోతలు సాగిస్తుంటారు. ఉర్దూ రాని ముస్లింలకు కూడ వివాహ ధృవీకరణ (నిఖానామా) పత్రాలను ఉర్దూలోనే జారీ చేస్తున్నారు. తెలుగు ముస్లిముల సౌలభ్యం కోసం ఖాజీలు తెలుగులోనే నిఖా ప్రసంగాలు చేస్తున్నారు. ఖురాన్‌, హదీస్‌వంటి మూల గ్రంథాలన్నిటిని తెలుగులో ముద్రించారు. అలాగే వివాహ ధృవీకరణ పత్రాలను కూడ తెలుగులో ముద్రించి ఇస్తే తెలుగులోనే పూరించి ఇస్తామని ఖాజీలు అంటున్నారు. కాబట్టి వక్ఫ్‌బోర్డు వివాహ ద్రువపత్రాలను తెలుగు భాషలో కూడా ప్రచురించాలి.
9 . ఏదైనా ఒక భాష దేవ భాష లేదా దేవతా భాష అనే అభిప్రాయం కలిగితే ఆ భాషను ఎంతో గౌరవిస్తారు. పూజ్య భావంతో మొక్కుతారు, సాగిల పడతారు. అందుకే తెలుగు భాషామతల్లిని మన పెద్దలు తెలుగుతల్లి అనే దేవతగా భావించి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ''మా తెలుగు తల్లికి మల్లెపూదండ ` మా కన్న తల్లికీ మంగళారతులు'' అంటూ అడపాదడపా పూజలూ జరిపిస్తున్నారు. మనిషికి జడవని వారు కొందరు దేవుడికి భయపడతారు. దేవుడి భాష పట్ల శ్రద్ధా భక్తులు కనబరుస్తారు. తమిళనాడు గుడుల్లో తమిళ మంత్రాలు,ప్రార్థనలు కూడా చదవొచ్చు,కులం వ్యక్తి అయినా అర్చకుడు కావచ్చు.తెలుగు మంత్రాలు,ప్రార్ధనలూ మన రాష్ట్రంలో కూడా రావాలి. " తెలుగు దేవభాషే" , LONG LIVE CLASSICAL DIVINE TELUGU  అంటూ  ప్రపంచ తెలుగు మహాసభలు చాటిచెప్పాలి.
10 . తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూ కూర్చిన నిఘంటువుల అవసరం ఉంది . ప్రపంచతెలుగుమహాసభలసందర్భంగా ఇలాంటి నిఘంటువులన్నీ కలిపి ఒకపెద్ద నిఘంటువును ప్రచురిస్తే బాగుంటుంది.    http://archive.org/details/padabhamdhaparij021997mbp
 ప్రాచీన భాషా పీఠం నిధులతో మహా నిఘంటువు, జాతీయాలు, సామెతలు, జానపదగీతాలు, పాత చిత్రాలలోని పాటలు మొదలైన సాహిత్య గ్రంథాలు ముద్రించాలి.1975 లో  లకంసాని చక్రధరరావు, ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సంపాదకత్వంలో ''తెలుగు వ్యుత్పత్తి కోశం'' పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది.ఈ సంపుటాలను ఆన్‌లైన్‌లో పెడితే బాగుంటుంది.ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది. కాగితం, కలం రోజులు పోయాయి. ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ ` పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడిరచే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
                                                                                               వందనాలతో
                                                                                          నూర్ బాషా రహంతుల్లా
                                                                                          డిప్యూటీ కలక్టర్ విజయవాడ
                                                                                                                        8885551644
http://www.worldteluguconference.com/

No comments:

Post a Comment